Friday, July 31, 2009

సింగార మూరితివి చిత్తజు

సింగార మూరితివి చిత్తజు గురుడవు చక్కగా జూచేరు మిము సాసముఖా

పూవుల తెప్పల మీద పొలతులు నీవు నెక్కి పూవులు ఆకసము మోప పూచిచల్లుచు
దేవ దుందుభులు మ్రోయ దేవతలు కొలువగా సావధానమగు నీకు సాసముఖా

అంగరంగ వైభవాల అమరకామినులాడ నింగి నుండి దేవతలు నినుజూడగా
సంగీత తాలవాద్య చతురతలు మెరయ సంగడి దేలేటి నీకు సాసముఖా

పరగ కోనేటి లోన పసిడి మేడ నుండి అరిది ఇందిరయు నీవు ఆరగించి
గరిమ శ్రీవేంకటేశ కన్నుల పండువ కాగ సరవినోలాడు సాసముఖా

No comments:

Post a Comment